తెలుగు · కవిత్వం
అందని ఉత్తరం
Written by
Chinna Reddy

చల్ల గాలి వర్షాన్ని సూచిస్తోంది
జనులందరు ఇళ్ళలోకి రయ్ రయ్ మంటున్నారు
చినుకులని పూలుగ ఆస్వాదిస్తూ ఒక జాబిలమ్మ
అహా అహా….ఏంటి ఆ సౌందర్యం
వన దేవతకు ఎంత అదృష్టం ఆ సౌందర్యాన్ని తాకుతునందుకు
ఆ భూదేవతకు ఎంత భాగ్యం ఆ పాదాలను ముద్ధడినందుకు
ఆ గాలికి ఎంత యోగ్యము ఆ స్పర్శ తెలిసినందుకు
గుచ్చిన ముళ్ళతో రక్తపు పాదాలతో అవేమి తెలియకుండా అందాన్ని చూస్తున్నాడు
ప్రేమించేస్తున్నాడు!
అంద అయస్కాంతం తాకమని ప్రేరేపించింది
ఆ రక్తపు నీరు చల్లటి జాబిలి పాదాలు చెంతకు చేరి చూడమని వేడుకుంది
ఒక్కర్నిక్కరు చూసుకున్నారు
ఒకరిలో ప్రేమ, మరొకరిలొ భయం
చేతికి అందని అందమైన సీతాకోక చిలుకల పరుగు
ఆ పరుగులో నెమలి నాట్యం
కునుకు లేకుండా ఎంతో కష్టపడి బ్రహ్మదేవుడు చేత చిక్కిన మానవ శిల్పినా?
లేదా! దేవకన్యనా?
ఆమె అదృశ్యమైంది! వర్షం మాయమైంది!
ఎవరి మాటలు వినపడ్డం లేదు! ప్రేమ మాయ అంటావ?
గుండె తలుపులు తెరిచింది
ప్రేమ గుడి కట్టింది
నిరంతర పూజలు అందుకుంది.
మది తలిచింది! మది పిలిచింది!
మళ్ళీ కనిపించవా అని
ప్రేమ దారిలో అందాల రాణి
మళ్ళీ కనిపించింది
దేవుడు చేసిన అందమైన బొమ్మలు ఏదురేదురుగా
ఆమెలో భయం లేదు ప్రేమ తప్ప
ప్రేమ అలలు కమ్ముకున్నాయి
చూపులుకి తెలుసు వారి ప్రేమ
పెదాలు వెనుక దాక్కున్న మాటలకి తెలుసు వారి ప్రేమ
పక్కనే ఉన్న మర్రి చెట్టుకి తెలుసు వారి ప్రేమ
మర్రి చెట్టులో దాక్కున్న పావురానికి తెలుసు వారి ప్రేమ
ఆకాశంలో ఆకలితో సంచరిస్తున్న గ్రద్ధకు తెలుసు వారి ప్రేమ
మాటలు లేని మౌన భాషకు తెలుసు వారి ప్రేమ
చిరుజల్లు కురిసింది
చిరునవ్వు మెరిసింది
వెనక్కి అడుగులు వేసింది
అందినట్లే అంది జారుకుంది.
ఆ నవ్వు వెనక దాగి ఉన్న మర్మం ఏంటి?
ఆ నవ్వు నిన్ను ప్రేమిస్తున్నాను అని తెలుపుతాందా?
ఆ నవ్వు నీలో అర్ధ భాగం అవుతాను అని తెలుపుతాందా?
ఆ నవ్వు వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటో? ఆ అందాల రాసికే తెలియాలి.
మర్రి చెట్టులొ దాక్కున్న పావురం ఎగిరింది
ఆకలితో గ్రద్ద ఇంకా సంచరిస్తోంది.
రాత్రి!
పగులు రాత్రి అని ఉంటుందా? ప్రేమ లోకం తప్ప
మేడ పై పడుకున్నాడు
ఆ చిరునవ్వు వెనుక రహస్యం ఏంటి? ప్రేమేనా అది?
ఆ నక్షత్రాలు పరిగెడుతున్నాయేంటి ? తనని చూడడానికేనా
గాలి వేగంగా వీస్తోందేంటి? తన స్పర్శ కోసమేనా
పక్షులు రాగాలు తిస్తున్నాయేంటి? తను ఆ రాగం వినడానికేనా?
ఈర్ష్య వచ్చింది!
చెట్లు మాత్రం అక్కడే ఉన్నాయి ఏంటి?
బహుశ ఆ అందాన్ని చూడలేదేమో! లేకపోతే రెక్కలు తెచ్చుకొని ఎగిరిపోయేవి
ప్రాణాలు కాపాడుకున్నట్టు వచ్చి పావురం మేడ పై వాలింది
ఆహారం కోసం చూసింది
గింజలు తెచ్చి వేశాడు
తిరిగి ప్రేమలోకానికి వెళ్ళిపోయాడు
నా ఊహలు రాణి ఏం చేస్తోందొ ఏంటో? మాట్లాడాలని ఉంది
టక్కుమని ఒక ఆలోచన
బావాలుని ప్రేమ మాటలుగా మలిచి ప్రేమలేఖ రాశాడు
సీత దగ్గరికి రాముడిని దరి చేర్చిన ఆ రామసేతులా
పావురం ఒక ప్రేమ సేతు అయింది
ప్రేమలేఖను ప్రేయేసి దరికి చేర్చింది పావురం
ప్రేమలేఖ చదివింది! ముసి ముసి నవ్వులు నవ్వుతూ మురిసిపోయింది.
ప్రేమదారిలో ఒక్కర్నిక్కరు మళ్ళీ కలుసుకున్నారు
ప్రేమలేఖ చేరిందా అని మౌన భాషతో అడిగాడు
మౌనంగా తల ఊపింది
వెళ్ళిపోవడానికి వెనక్కి అడుగులు వేసింది
తను కూడా తన వెంట అడుగులు వేస్తూ ముందుకు సాగాడు
అవి ఏడంటే ఏడు అడుగులు మాత్రమే
చిరుజల్లు కురిసింది
చిరునవ్వు మెరిసింది
ఆ నవ్వు వెనుక రహస్యం తెలిసింది
ఆ నవ్వు ప్రేమిస్తున్నాను అని తెలిపింది
ఆ నవ్వు నీలో సగభాగం అవుతాను అని చెప్పింది.
ప్రేమలో దొరికే సంతోషం ఆస్వాదిస్తున్నారు
మదిలోని ప్రేమ మాటలు
రాగాలుగ మార్చాడు
ఉత్తరంలోకి చేర్చాడు
పావురానికి ఇచ్చాడు
ఆ ప్రేమసేతు ప్రేయసీ దరికి చేర్చేది.
ప్రేమ...ప్రేమ...ప్రేమ నవ్విస్తుంది ఏడిపిస్తుంది
చేపకు నీరంటే ప్రేమ! వలలో చిక్కుకొదా?
చిలుకకు ఆకాశమంలొ సంచరించడంటే ప్రేమ! పంజరంలో ఇరుక్కుపోదా?
కుందేలుకు అడవంటే ప్రేమ! వేటగాడి దొరక్కపోదా?
అలాగే ప్రేమకి కూడా కులం, మతం, పెళ్లి ఎన్నో అడ్డంకులు
ఇక్కడ పెళ్లి అనే ఆపద
దేవకన్య అందమైన కళ్ళ నుంచి కన్నీళ్లు
ప్రేమ కన్నీళ్లు విలువ నేల రాలడమ?
నవ్వుతూ ఉండే ఆ ఎర్రటి పెదాలు మసకబారడమా?
నాట్యం లాంటి ఆ నడకకు, నరకాయత్ర చేయడమా?
జాబిలమ్మను చూస్తూ ఆ పావురం కన్నీళ్లు పరవశమైంది
ఆ ప్రేమ కావాలి!
పావురాన్ని చూడగానే ప్రేమకు ప్రాణాలు తిరిగిచ్చాయి
ప్రేమ ఉత్తరం రాసింది
ఆ ఉత్తరాన్ని దరి చేర్చమని పావురాన్ని వేడుకుంది
మర్రిచెట్టు కింద ఎదురు చూస్తోంది
భూమిలో దాగి ఉన్న విత్తనం వర్షం కోసం ఎదురుచూసినట్టు
గూడులో దాక్కున్న పక్షిపిల్లలు తల్లి కోసం ఎదురుచూసినట్టు
తల్లిపాలు కోసం దూడ ఎదురుచూసినట్టు
ఎదురు చూస్తూనే ఉంది, చూస్తూనే ఉంది
మర్రి చెట్టు ఓడలు ఉగాయి, బహుశ వాడు రాడు అని చెబుతుందా?
పెళ్ళివారు ఆ మర్రి చెట్టుని పూజిస్తున్నారు
చిరుజల్లు కురవలేదు
వేడిగాలి వేగమైంది
ఆ కన్య పక్క ఒక ఎముక పడింది
ప్రేమ అక్షరాలు ఉన్న ఒక తెల్లటి కాగితం
తన చేతిలో పడింది
కన్నీళ్లు... కన్నీళ్లు... కన్నీళ్లు…
ఆకాశంలో గ్రద్ద ఆకలి తీరి అనందంగా సంచరిస్తోంది
మర్రిచెట్టులో దాగి ఉన్న నిజం, ఆ రోజు ఆమెకి చెప్పలేదు
ఇప్పుడు చెప్పినా ప్రయోజనం లేదు
మర్రి చెట్టు విచారించింది.
దూరం నుంచి నిజం చూసాడు వాడు
కళ్ళలో కన్నీళ్లు లేవు
గుండెళ్ళో బాధ లేదు
అసలు శరీరానికి చెలనమే లేదు
వెళ్ళిపోయాడు! ఎక్కడికో తెలియదు?
కనిపించనంత దూరం వెళ్ళిపోయాడు!
నింగి - నేల కలిసే చోటికి వెళ్ళిపోయాడా?
పడమర ఉదయించే సూర్యుడు దరికి వెళ్ళిపోయాడా?
తార లేని ఆకాశంలోకి వెళ్ళిపోయాడా?
వెళ్ళిపోయాడు! వెళ్ళిపోయాడు!
మర్రి చెట్టు ఎండిపోయింది
చల్లగాలి వర్షాన్ని సూచిస్తోంది
జనులందరు రయ్ రయ్ మంటున్నారు!