తెలుగు · సంభాషణం

తను నేను

Written by

Chinna Reddy

తను నేను

నేను: ఈ క్షణం చాలా బాగుంది కదా?

తను : చాలా బాగుంది, ఎందుకో తెలియదు చాలా సంతోషంగా ఉంది.

నేను: సముద్ర తీరం, నక్షత్రం, చందమామ ఇవి ఉంటే సంతోషంగానే ఉంటుంది.

తను: అవును కానీ ఆకాశంలో చాలా నక్షత్రాలు ఉన్నాయి కదా, నక్షత్రం అంటున్నావు ఏంటి ?

నేను: ఆ క్షణంలో నాకు ఆ ఒక్క నక్షత్రమే కనిపించింది అలా అని ఉంటా.

తను: ఈ సముద్రాలు చాలా బాగున్నాయి కదా?

నేను: ఇక్కడ నుంచి అన్ని సముద్రాలు ఒకేసారి కనిపించాయా ?

తను: అంతే కదా! ఏ సముద్రంలో అయినా ఉండేది ఉప్పు నీరే కదా. ఈ సముద్రంలో నుంచి సముద్రంలన్నీ చూసేసా.

నేను: బాగా చెప్పావు.

తను: నీ నుంచే నేర్చుకున్న, నా కళ్ళతో చూడు నీకు అలానే కనిపిస్తాయి.

నేను: నీ కళ్ళలోకి చూడగలను కానీ, నీ కళ్ళతో చూడలేను కదా.

తను: మరి చూడు నీకు సముద్రాలు, నాకు నక్షత్రం కనిపిస్తుందేమో.

నేను: సరే చూస్తాను.

తను: సరే చూడు.

నేను: నువ్వే కనిపిస్తున్నావు.

తను: నా కళ్ళలోకి చూడమన్న , నన్ను కాదు.

నేను: నేను చూసింది నీ కళ్ళలోకే.

తను : కానీ నాకు మాత్రం నక్షత్రం కనిపించింది.

నేను: నక్షత్రాలు కనిపించలేదా?

తను: లేదు, నేను నక్షత్రాన్ని చూడాలనుకున్న చూశా. నువ్వు నన్ను చుడాలనుకున్నావు అదే చూశావు.

నేను: నా మనసుతో చూడు నువ్వే కనిపిస్తావు.

తను: నన్ను మర్చిపోవా ఇంకా ?

నేను: మర్చిపోవడానికి ప్రేమిస్తారా ?

తను: మరవడంతోనే కొత్త జీవితం ప్రారంభం అవుతుంది అంటున్న .

నేను: ఏంటి మరణంతోనా ?

తను: మరవడంతో అన్నాను, మరణంతో కాదు.

నేను: అవునా! తప్పుగా వినిపించింది.

తను: ఎలాంటి తప్పునైనా సరిదిద్దుకోవచ్చు.

నేను: ప్రేమించడం తప్పు కాదుగా?

తను: కానీ మర్చిపోవడం తప్పదుగా.

నేను: ప్రేమించడం, మర్చిపోవడం మన చేతిలో లేదు.

తను: కానీ అవి రెండు మనలో నుంచి వచ్చినవే కదా .

నేను: నిన్ను చూసి నా హృదయం స్పందించింది, మరి ఎవరిని చూసి నా హృదయాన్ని బంధించాలి?

తను: నేను నీక లేను అనే నిజాన్ని నమ్మి.

నేను: నా ఎదురుగానే ఉన్నావు కదా?

తను: కానీ నీతో ఉండను కదా.

నేను: నాతో ఉండకపోవచ్చు కానీ నాలో ఉన్నావు.

తను: మరి నీకు కావాల్సింది నీలో ఉంటే ఈ బాధ ఎందుకు, ప్రపంచానికి దూరంగా ఉండడం ఎందుకు.

నేను: నాలో ఉంది కాని నాతో లేదు అందుకే ఈ వ్యధ.

తను: ఆ నిజాన్నే నమ్మాలి అని చెప్తున్న. నీతో లేనప్పుడు నీలో కూడా ఉండకూడదు.

నేను: నాలో ఉన్నది నువ్వే కదా నీతో పాటి తీసుకువెళ్ళిపో

తను: నీలో ఉన్నది నా గురించి నీ ఆలోచన, నా గురించి నీ జ్ఞాపకం, నాతో నువ్వు ఊహించిన జీవితం.

నేను: …………..

తను: ఏడవకు, ఎంత ఆనందంగా ఉండేవాడివో గుర్తుందా? నువ్వు ఉంటే చుట్టూ అల్లరి, ఆనందం ఉండేది. ఇప్పుడు నిన్ను ఒంటరివాడిలా చూడలేకపోతున్న.

నేను: నీ కళ్ళలో కన్నీళ్ళు వద్దు, చూడు కావాలంటే నేను ఏడవడం లేదు.

తను: మరి నన్ను మర్చిపోతావు కదా?

నేను: జీవించాలి అంటే మరవాల్సిన అవసరం లేదు. ఇది వరుకు ఎలా జీవించానో అలా జీవిస్తా.

తను: నిజంగా అలానే ఉంటావా?

నేను: నా ప్రేమ మీద ఒట్టు.

తను: మరి ఆ కన్నీళ్ళు తుడుచుకో.

నేను: రానివు, ఉప్పునీరే కదా సముద్రం తనలో కలుపుకుంటుంది.

తను: అలా అయితే నావి కూడా కలుపుకోమను.

నేను: సముద్ర అలలు చాలా ఎక్కువ అయ్యాయి కదా.

తను: అర్ధరాత్రి దాటింది కదా.

నేను: అవును గురుత్వాకర్షణ శక్తి వల్ల అందని చందమామ కోసం ఎగసి ఎగసి పడతాయి.

తను: మనం బయలుదేరుదామ అలలు తాకిడి ఎక్కువ అయింది.

నేను: అదిగో అక్కడ దూరంగా ఒక పెద్ద అల వస్తుంది కదా, ఆ అల మనల్ని తాకగానే వెళ్దాం.

తను: అయితే ఆ అలని కాస్త నెమ్మదిగా రమ్మని సముద్రానికి చెబుదాం.